అతడు పక్కా రాజకీయ నాయకుడు. ఆమె సొంత భావాలున్న సివిల్ (ఐఏఎస్) సర్వెంట్. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే.. ఆమె సబ్ కలెక్టర్. ఇద్దరి దారులు వేరు కానీ లక్ష్యం ఒక్కటే అదే ప్రజలకు సేవ చేయడం. దారులు వేరైనా లక్ష్యం ఒకటే అనుకున్నారు కాబోలు వీరి స్నేహం, ప్రేమ వీరి దారులను కలిపింది. వచ్చే నెలలో ఆ ఇద్దరు ఓ ఇంటి వారు కానున్నారు. ఇంతకీ ఈ పొలిటికల్ కమ్ బ్యూరో క్రటిక్ ల లవ్ స్టోరీ గురించి తెలియాలంటే.. కేరళకు వెళ్లాల్సిందే.
కేరళలోని అరువిక్కర నియోజకవర్గంకు శబరినాథన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అదే రాష్ట్రానికి చెందిన IAS అధికారి, తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్యనాయర్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా పోస్ట్ ద్వారా వెల్లడించారు. తిరువనంతపురంలో 2016లో ఓ ఫంక్షన్ లో ఫస్ట్ టైం సబ్ కలెక్టర్ దివ్యను కలిశారు ఎమ్మెల్యే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందన్నారు శబరినాథన్.
తన మనసులోని మాటను సబ్ కలెక్టర్ కు చెప్పారు ఎమ్మెల్యే. ఆరు నెలల ప్రేమ తర్వాత.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ జంట. రెండు కుటుంబాలు ఓకే కూడా చెప్పాయి. 2017 జూన్ నెల చివరిలోనే వివాహం జరగనున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే శబరినాథన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంబీఏ చదివారు. ఇతనిది రాజకీయ కుటుంబం. తండ్రి కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్ కార్తికేయన్. TCSలో ఉద్యోగం చేస్తూ.. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. సబ్ కలెక్టర్ దివ్య ఎంబీబీఎస్ చదివారు. 2013 సివిల్స్ రాసి 48వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే.. ఓ సబ్ కలెక్టర్ ను పెళ్లి చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.