ముక్కు కాదు…ఏదైనా కోసేస్తారు…

238
Kerala actress pens letter to CM after being victim-shamed
- Advertisement -

ఫిబ్రవరిలో కిడ్నాప్‌నకు గురైన ఓ ప్రముఖ మలయాళీ నటి.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాసింది. ‘నేను ఆత్మహత్య చేసుకోవాలా? లేక ఇంట్లోనే కుమిలిపోతూ కూర్చోవాలా? ఎవ్వరికీ కన్పించకుండా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలా’? అంటూ ఆ లేఖలో పేర్కొంది.

అయితే కేరళకు చెందిన ఎమ్మెల్యే పీసీ జార్జి ఇటీవలే ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో నటిపై కామెంట్స్‌ చేస్తూ.. ‘ఆమెపై జరిగిన సంఘటన నిర్భయ కంటే ఘోరమైనదని పోలీసులు కోర్టులో చెప్పారు. అంత ఘోరమైన ఘటనను ఎదుర్కొన్నప్పుడు ఆమె మరుసటి రోజే చిత్రీకరణకు ఎలా వెళ్లింది’ అనివ్యాఖ్యానించారు. అయితే పీసీ జార్జి కామెంట్స్‌ కి నటి స్పందిస్తూ.. జార్జిపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎంకు లేఖరాసింది.

‘నాపై ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఎంతగా కుమిలిపోతున్నానో చెప్పలేను. నాదే తప్పని వేస్తున్న నిందలను భరించలేకపోతున్నాను. నా కుటుంబం కూడా తట్టుకోలేకపోతోంది. కానీ ఈ ఘటనపై పోరాడాలన్న ఒక్క ఆలోచనే నన్ను ముందుకు నడిపిస్తోంది. నన్ను కిడ్నాప్‌ చేసిన మరుసటి రోజే నేను షూటింగ్‌లో పాల్గొన్నట్లు జార్జి అన్నారు. కానీ నేను ఈ ఘటన జరిగిన పదిరోజుల తర్వాతే నా గది నుంచి బయటికి వచ్చాను. అసలు జార్జిలాంటి మనుషులు అలా ఎలా ఆలోచిస్తారు. అంటేనన్ను కిడ్నాప్‌ చేసినందుకు నేను ఆత్మహత్య చేసుకోవాలా? లేక కుమిలిపోతూ ఎవ్వరికీ కనపడకుండా పారిపోవాలా? నాలాగే చాలా మంది మహిళలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. కానీ జార్జిలాంటి మనుషుల కారణంగా ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోతున్నారు. పైగా మహిళాసంఘాలు నా ముక్కు కోయడానికి వస్తాయా? అని పొగరుగా మాట్లాడారు. ఒకవేళ ఆ మహిళా సంఘాలు నాకోసం పోరాడటానికి వస్తే ముక్కు కాదు ఏదన్నా కోసేస్తారు. అతను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు’ అని లేఖలో పేర్కొంది.

నటి కేసులో మలయాళీ నటుడు దిలీప్‌కుమార్‌, సహా నటి మాజీ డ్రైవర్‌ పల్సర్‌ సునీను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -