ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘మెటా’ (Meta) సంస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతదేశంలో తన సోషల్ మీడియా ఖాతాను మెటా నిలిపివేసిందని దీనికి సంబంధించి సంస్థ ఎలాంటి కారణాలు లేదా వివరణ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మెటా మరియు మెటా ఇండియా యాజమాన్యాన్ని నేరుగా ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ చేశారు. హాయ్ @Meta @metaindia, నా ఖాతాపై ఎందుకు ఆంక్షలు విధించారు? మీ ఇండియా ఆఫీసులో నోటిమాటగా విచారించగా.. భారత్‌లో నా ఖాతా అందుబాటులో లేదని, ఆంక్షలు విధించామని తెలిసింది. ఎందుకు? మీ ఆఫీసులో ఉన్నవారెవరూ దీనికి కారణాలు చెప్పడం లేదు. ఈ ఆంక్షలను ఎలా తొలగించుకోవాలో కూడా ఎవరూ సూచించడం లేదు. నేను పంపిన ఈమెయిళ్లకు కేవలం ఆటోమేటెడ్ రిప్లైస్ తప్ప సరైన సమాధానం రావడం లేదు. ఇది చాలా నాసిరకం సేవ. మన ప్రధాని ముందు అంతగా తలవంచకండి. లేదంటే భారత్‌లో ఆయన ఖాతా ఒక్కటే నడుపుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తారు చెప్పాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో పోస్ట్‌ను ఫేస్‌బుక్ తాత్కాలికంగా తొలగించడం, ఆ తర్వాత దీనిపై మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి, ఐటీ శాఖ మంత్రికి క్షమాపణలు చెప్పడం వంటి పరిణామాలు జరుగుతున్న తరుణంలోనే కేజ్రీవాల్ తన ఖాతాపై ఆంక్షలు విధించారంటూ ఆరోపించడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏ ప్రత్యేక ఖాతాపై ఈ ఆంక్షలు పడ్డాయనేది ఆయన స్పష్టంగా పేర్కొనలేదు.ఈ వ్యవహారంపై మెటా సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

