చదువుకోవాలనే ఆకాంక్ష ఉంటే సరిపోదు.. దానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిందే అన్నట్లుగా మారింది మధ్యప్రదేశ్‌లోని విద్యార్థుల పరిస్థితి. విదిశా జిల్లాకు చెందిన పాఠశాల పిల్లలు రోజూ బడికి వెళ్లడానికి చేస్తున్న భయంకరమైన ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విదిశా జిల్లాలోని బెట్వా నదిపై ఉన్న డ్యామ్ పిల్లర్ల మీద ఒక్కో అడుగు వేసుకుంటూ చిన్నారులు ప్రమాదకరంగా నదిని దాటుతున్నారు.
10 కిలోమీటర్ల భారం: సాధారణ రహదారి ద్వారా వెళ్లాలంటే దాదాపు 10 కిలోమీటర్లు అదనంగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.అంత దూరం వెళ్లలేక, సమయానికి బడికి చేరుకోవడానికి విద్యార్థులు సురక్షితమైన మార్గం లేక డ్యామ్ కాంక్రీట్ పిల్లర్ల మీద నడుస్తున్నారు.ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి కాలు జారినా నేరుగా హోరెత్తే బెట్వా నది ప్రవాహంలో పడి ప్రాణాలు పోవడం ఖాయం.
ఏదో ఒక్కరోజు ఎదురైన తాత్కాలిక సమస్య కాదు ఇది. గడిచిన ఐదేళ్లుగా విద్యార్థులు రోజూ ఇలాగే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న చిన్నారులు డ్యామ్ పిల్లర్లపై బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు, స్థానిక ప్రజలు ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు స్థానిక అధికారులు నిద్రలేచారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. విద్యార్థుల రవాణా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని వారి కోసం త్వరలోనే ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

