రాష్ట్రంలో సిరులు పడించే శక్తిమంతమైన జల వనరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సాక్షిగా నిలవనుంది.ఎస్సారెస్పీకి తిరిగి ప్రాణం పోసేందుకు ఉద్దేశించిన పునర్జీవ పథకం ప్రారంభోత్సవానికి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్‌లో ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పైలాన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరిస్తారు. అనంతరం 1.10 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభనుద్దేశించి ప్రసంగించనున్నారు.
వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఎస్సారెస్పీ మారనుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తరచు తలెత్తుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పేరిట.. ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. ప్రాజెక్టుతో పాటు.. దీనికిందనున్న కాలువల ఆధునికీకరణ పనులనూ ప్రభుత్వం చేపడుతోందిఈ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలిస్తారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం సఫలమైతే.. నిజామాబాద్ జిల్లా అన్నదాతల సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భారీస్థాయిలో పూడిక పేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీలు. అయితే.. ఎగువ ప్రాతాల నుంచి వచ్చే వరదనీటితో పాటు చెత్తాచెదారం కూడా చేరడంతో.. ప్రాజెక్టులో పూడిక భారీగా పేరుకుంది. ప్రస్తుతం 80.104 టీఎంసీల నీరే నిల్వ చేయగలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గడచిన యాభై సంవత్సరాల్లో దాదాపు 40 టీఎంసీల నీటి నిల్వను ప్రభావితం చేసే స్థాయిలో పూడిక చేరిందని సర్వేల ద్వారా తేలింది. పూడిక ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా ఆరు వరదగేట్లనూ ప్రాజెక్టులో భాగంగా డిజైన్ చేశారు. అయితే, వాటిని ఇంతవరకూ ఎత్తక పోవడంతో.. ఇప్పుడా గేట్లూ పూడికలో మూసుకుపోవడం గమనార్హం. ప్రాజెక్టు నుంచి పూడిక తీయడం కష్టసాధ్యం కావడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.
ఇందులో భాగంగా.. కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌లో నింపడం పునరుజ్జీవ పథకం ముఖ్య ఉద్దేశం. కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్‌కు నీటిని మళ్లించడానికి రూ.1067 కోట్లు.. కాలువల ఆధునీకరణ పనులకు మరో 8.63 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 58 వేల ఎకరాలకు నీరు అందుతుంది. పంటలకు నీరులేక అగచాట్లు పడ్డ రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది.