పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్ గెలిస్తేనే మంచిర్యాల జిల్లాగా ఉంటుందని లేకపోతే ఎత్తేస్తారని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షోకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. ఉప్పొంగిన అభిమానంతో అడుగడుగునా అపూర్వస్వాగతం తెలిపారు. ఇసుకేస్తే రాలనంత జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్.. ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకు అయిందో ఆలోచన చేయాలన్నారు.
ఐదు నెలల కింద సాగునీళ్లకు, మంచినీళ్లకు, కరెంట్‌కు ఇబ్బంది లేదు. సాగు, తాగునీరు, కరెంట్ విషయంలో ఈ ఐదు నెలల్లోనే ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలన్నారు. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు అని మండిపడ్డారు.
నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. నల్లా నీళ్లు ఎక్కడ మాయమయ్యాయని, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడికి పోయిందని, కల్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రైతుబంధు ఎటుపోయింది? అందుకోసం పెట్టిన నిధులు ఎటుపోయాయని ప్రశ్నించారు. డిసెంబర్ 9 పోయింది, వంద రోజులు పోయాయని, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 అంటున్నాడని, నమ్మవచ్చునా? అని నిప్పులు చెరిగారు.
Also Read:Revanth:కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే