రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 18, 19, 20 న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలకు బతుకమ్మ పండుగ రోజున ఉచితంగా చీరలను పంపిణి చేయాలని సూచించారు.
18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ సెప్టెంబర్ 18, 19, 20 న చీరలను పంపిణీ చేస్తారన్నారు. కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలనే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పేద మహిళలందరికీ చీరలందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం ఆకాంక్షించారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా కలెక్టర్లు పర్యవేక్షించాలని కేసీఆర్ ఆదేశించారు.
కోటి 4 లక్షలకు పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయారు చేయడానికి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి చీరలు సెప్టెంబర్ రెండో వారంలో జిల్లా కేంద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి రేషన్ షాపులకు చీరలను పంపుతారు. రేషన్ షాపుల్లో సెప్టెంబర్ 18, 19, 20 న మహిళలకు పంపిణీ చేస్తారు. సదరు మహిళ షాపుకు రాలేని పరిస్థితి ఉంటే… ఆమె భర్తకానీ, తల్లిగానీ, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. రేషన్ షాపుల్లో ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ.. మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది.