బావి తరానికి మంచి విద్యను అందించడం ద్వారానే పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కెజి టు పిజి విద్యావిధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా గురుకుల విద్యాలయాలు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు వారి జనాభాను అనుసరించి గురుకుల విద్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గురుకుల విద్య విస్తరణపై క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, డిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపిలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బాబు మోహన్, గణేష్ గుస్తా, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రేషన్ బియ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ.. బావి తరాలకు మంచి విద్య అందించడం ద్వారానే పేదల జీవితాలు బాగుపడతాయని తాను బలంగా నమ్ముతున్నట్లు సిఎం వెల్లడించారు. అందుకే ఒక్కో విద్యార్థిపై దాదాపు 84వేల రూపాయల ఖర్చు పెడుతూ మంచి విద్య, వసతి, ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి బిసిలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మైనారిటీ వర్గాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఏడాది 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం మరో 89 విద్యాలయాలు ప్రారంభిస్తామని, దీంతో గురుకులాల సంఖ్య 160కి చేరుకుంటుందన్నారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో మైనారిటీల జనాబా, స్థలాల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంకా అదనంగా గురుకులాలు మంజూరు చేయడానికి కూడాసిద్దమని సిఎం ప్రకటించారు.
2016-17 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ గురుకుల విద్యాలయాల ద్వారా 17వేల మందికి విద్య అందుతున్నదని, దీనికోసం రూ.143.21 కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. 160 గురుకులాల ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష మంది విద్యార్థులకు గురుకుల విద్యాలయాల ద్వారా మంచి విద్య అందుతుందన్నారు. ఇందుకోసం రూ.2,568 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. దీనికి అదనంగా గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో 3వేల కోట్లు వెచ్చిస్తామన్నారు. లక్ష కుటుంబాలకు మంచి భవిష్యత్ అందుతుందని చెప్పారు. ఇది మార్పు దిశగా వేస్తున్న గొప్ప ముందడుగుగా సిఎం అభివర్ణించారు.
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని మైనారిటీ గురుకులాలు ఏర్పాటు కావాలని, ఆయా ప్రాంతాల్లో మైనారిటీ జనాభా ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనారిటీ జనాభా ఎక్కువున్న చోట ఒక బాలికల, ఒక బాలుర గురుకాలంతోనే సరిపెట్టకుండా ఎన్ని అవసరమైతే అన్ని స్థాపించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు చాలా గొప్పగా పనిచేస్తున్నాయని. అదే తరహాలో మైనారిటీ గురుకులాలు కూడా మొదటి ఏడాదే మంచి పేరు తెచ్చుకోవడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో గురుకుల విద్యాలయాల సంఖ్యను విరివిగా పెంచుకుంటామన్నారు. ఇది కెజి టు పిజి విద్యావిధానానికి పునాది వంటిదని పేర్కొన్నారు.