తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలింది. సీఎం కేసీఆర్ సభలో నాగార్జున సాగర్ దివంగత నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పని చేశాం. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు అని సీఎం తెలిపారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కరోనా వచ్చి కూడా పోయింది. హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే నోముల 64 ఏండ్ల వయసులో గత డిసెంబర్‌లో గుండెపోటుతో మరణించడం తెలంగాణ ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు.