సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అంశంపై గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు డిపెండెంట్ ఉద్యోగాలపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ హైకోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెలువడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై న్యాయపోరాటానికి సిద్దమని కేసీఆర్ తెలిపారు. జీవితమంతా కష్టపడ్డ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కొందరు దురుద్దేశంతోనే హైకోర్టుకు వెళ్లారని కార్మికులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా అప్పీల్ చేసి కార్మికుల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. కార్మిక చట్టాలపై గట్టి పట్టున్న సీనియర్ న్యాయవాదుల బృందాన్ని నియమించనున్నట్టు తెలిపారు. సీనియర్ న్యాయవాదుల బృందంతో సుప్రీంకోర్టులో వాదనలను వినిపిస్తామని తెలిపారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా సింగరేణి యాజమాన్యం జారీచేసిన ప్రకటనను న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షించి సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు.