తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా తెలుగు మహాసభలు జరగనున్నాయి. డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరిగే మహాసభల కోసం భాగ్యనగరం సర్వాంగసుందరంగా ముస్తాభైంది. భాగ్యనగరాన్ని శోభాయమానం చేసే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నగరమంతా ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు..నగరంలోని రహదారులకు ఇరువైపులా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో సైతం తెలుగు మహాసభల సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి.
తెలుగు మహాసభలకు వచ్చే అతిథులకు అపూర్వ స్వాగతం పలికేందుకు కూడా అద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి తిరిగి 20న డిల్లీకి వెళతారు. తెలుగు మహాసభల్లో తెలంగాణ భాష,సాహిత్యం,సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు మన గౌరవానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ తెలుగు మహా సభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, నూటికి నూరు శాతం ఆహ్వానితులను తగు రీతిలో గౌరవించాలని, సౌకర్యాలు కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాన ఘట్టాలైన ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాల విషయంలో నిర్ణయాత్మకంగా ఉండాలని, ఇదొక బహుముఖమైన కార్యక్రమం కాబట్టి ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్త పడాలని సిఎం అన్నారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వస్తున్నారని, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ , మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావు విశిష్ట అతిథులుగా వసున్నారని, ప్రపంచ తెలుగు మహా సభల ప్రారంభ ప్రకటన ఉప రాష్ట్రపతి చేయగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఎల్.బి.స్టేడియం వద్ద ప్రతిరోజు తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరిని ప్రదర్శించాలని, సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలని సిఎం అన్నారు.విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరెవరు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ వేదికల వద్ద జరిగే సభలకు హాజరవుతారో వివరాలు రూపొందించి దానికి అనుగుణంగానే సౌకర్యాలు కలిగించాలని సిఎం అన్నారు. విదేశీ ప్రతినిధులకు రవాణా కొరకు కార్లు ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు.
13 భారతీయ గుర్తింపు పొందిన భాషల్లో జ్ఞాన్ పీఠ్ ఆవార్డు బహుమతి గ్రహీతలను వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించి తగు రీతిలో సత్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంత మంది ఇతర భాషల వారిని సన్మానం చేశామన్న కీర్తి తెలుగు మహా సభల సందర్భంగా మనకు దక్కాలని సిఎం అన్నారు.