తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూ సర్వే నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 80 సంవత్సరాల తర్వాత రాష్ర్టంలో భూ రికార్డులను ప్రక్షాళన చేసే విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతపై సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
భూ సర్వే రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతు సంఘాలు ఏర్పాటు, రైతు సదస్సుల నిర్వహణ తేదీలను సీఎం నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు గ్రామరైతు సంఘాల సమన్వయ సమితులు ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు మండల స్థాయిలో రైతు సమన్వయ సమితులు, సదస్సులు నిర్వహణ చేపట్టనున్నారు.
మొత్తం 3600 బృందాలతో రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సీఎం నిర్ణయించారు. రెవెన్యూ అధికారి, వ్యవసాయ అధికారి, రైతు సంఘం సమన్వయంతో భూరికార్డుల సవరణ కొనసాగనుంది. నెలరోజుల పాటు గ్రామ సభ నిర్వహించి భూ రికార్డుల సవరణ చేపట్టనున్నారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒక్కో యూనిట్ బాధ్యత తీసుకుని భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పర్యవేక్షించనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రికార్డులు సరిచేసి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. ఆన్‌లైన్‌లో వివరాల ఆధారంగానే ఏడాదికి ఎకరాకు రూ.8 వేలు పెట్టుబడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది.