పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతకు ప్రతి అడుగులోనూ షాక్‌లే. సొంత పార్టీ నేతల తిరుగుబాటు…స్వయంగా మమతనే ఓటమి పాలు కావడం, చివరికి పార్టీ గుర్తు సైతం మమత చేజారడం వరకు ఆమె రాజకీయ ప్రమాణంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదరయ్యి ఉండదు.
అయితే మమత రాజకీయ ప్రయాణం ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హస్తాన్ని అందుకోవడానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసి, సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను స్థాపించిన ఆమె నేడు తన సొంత పార్టీలోనే అదే తరహా తీవ్ర అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు.
1990ల మధ్యకాలంలో నాటి పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమేన్ మిత్రాతో వచ్చిన తీవ్ర విభేదాల కారణంగా మమతా బెనర్జీ 1998 జనవరి 1న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ‘అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్’ను స్థాపించారు. స్వయంగా ఆమె గీసిన ‘గడ్డి నుంచి పుట్టుకొచ్చిన జంట పూల’ గుర్తు TMCకి ప్రధాన గుర్తింపుగా మారింది. కాంగ్రెస్‌ను స్థానికంగా ఖాళీ చేస్తూనే, 34 ఏళ్ల కమ్యూనిస్టుల (సీపీఎం) సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి 2011లో బెంగాల్‌ను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు.
ఏ ఆయుధంతో అయితే ఆమె కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తి సాధించారో, అదే తిరుగుబాటు ఆయుధం నేడు ఆమె స్థానాన్ని, అస్తిత్వాన్ని సవాలు చేస్తోంది.వర్గపోరు మరియు తిరుగుబాటుదారుల దావాల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇటీవల టీఎంసీ పేరును, ‘జంట పూల’ గుర్తును ఫ్రీజ్ చేసింది.
మమత వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అని రెబల్ వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అని గుర్తింపునిచ్చి తాత్కాలిక గుర్తులు కేటాయించింది. కాంగ్రెస్‌లో పుట్టి ఆ కాంగ్రెస్‌నే ముగించడానికి చూసిన మమతకు, కాలం మరియు కర్మ (Karma) ఇప్పుడు అదే పరిస్థితిని ఎదురుచూసేలా చేశాయని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుత సంక్షోభం ఆమెను ఎంతటి ఆత్మరక్షణలోకి నెట్టిందో నందిగ్రామ్ ఉప ఎన్నిక ఉదాహరణగా నిలుస్తోంది.నందిగ్రామ్‌లో తమ వర్గం అభ్యర్థిగా ప్రకటించిన సంచితా ప్రధాన్ చేత నామినేషన్ ఉపసంహరింపజేసిన మమత, అక్కడ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్‌ను ఓడించి ఎదిగిన మమతా బెనర్జీ, ఈ రోజు అదే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు కోరడం ద్వారా ఆమె 28 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

