హిందీ భాషపై తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం తన ద్విభాషా విధానానికి (తమిళం, ఇంగ్లీష్) కట్టుబడి ఉంది. రాష్ట్రంలో జవాహర్ నవోదయ విద్యాలయాల (JNV) ఏర్పాటుకు భూమిని కేటాయించేది లేదని స్పష్టం చేసింది. ఈ వివాదం వేళ రాష్ట్ర అధికార పక్షమైన టీవీకే (తమిళగ వెట్రి కజగం) మరియు ప్రతిపక్షమైన డీఎంకేలు ద్విభాషా విధానాన్ని కాపాడుకోవడంలో ఒకే తాటిపైకి రావడం గమనార్హం.
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘నవోదయ విద్యాలయ సమితి’ నిర్వహించే జవాహర్ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ నిధులతో నడిచే అభ్యుదయ ఆశ్రమ పాఠశాలలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఇవి ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలులో ఉంటుంది, అందులో హిందీ ఒక భాగంగా ఉంటుంది.
తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచీ ద్విభాషా విధానానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో, త్రిభాషా సూత్రం ఆధారంగా నడిచే ఈ కేంద్ర పాఠశాలల ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. తమ విద్యా విధానానికి భిన్నమైన హిందీని రుద్దే కేంద్ర పథకాలకు భూమిని కేటాయించేది లేదని తేల్చిచెప్పింది.
నవోదయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది: తమిళనాడు మట్టిపై హిందీని బోధించకూడదనే మొండి పట్టుదలతో ఉండకూడదు. రాష్ట్రం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి అని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఒక రాష్ట్రం భారత్‌లో భాగమని, ప్రత్యేక దేశంలా వ్యవహరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. నవోదయ విద్యాలయాలు రావడం వల్ల తమిళనాడు స్వతంత్రత దెబ్బతినదని, విద్యార్థులకు అదనపు విద్యా అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడింది.
Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో స్థలాలను గురుతించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు తమిళనాడుకు మరో మూడు నెలల సమయం ఇచ్చింది. అయితే, ఈ మౌఖిక వ్యాఖ్యలు ఇంకా తుది తీర్పు కాదని, విచారణ కొనసాగుతోందని పేర్కొంది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి, టీవీకే నాయకుడు రాజ్‌మోహన్ ఆరుముగం స్పందించారు. తమిళనాడులో గతంలోనూ, ఇప్పుడు కూడా ద్విభాషా విధానమే అమల్లో ఉంది. దానికి మేం పూర్తి కట్టుబడి ఉన్నాం. మేం హిందీకి లేదా మరే ఇతర భాషకు వ్యతిరేకం కాదు. కానీ, తమిళ మట్టిపై తమిళ భాష రక్షణకే మేము ప్రాధాన్యత ఇస్తాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేవలం విచారణ సమయపు అభిప్రాయాలు మాత్రమే తప్ప తుది తీర్పు కావు అని మంత్రి స్పష్టం చేశారు.

