కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఈ రోజు ఒక్క రూ పాయికే అంతిమ యాత్ర కార్యక్రమానికి ఇవాళ నగర మేయర్ రవీందర్‌సింగ్ శ్రీకారం చుట్టనున్నారు. పేదలకు అంత్యక్రియలు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు సామాజిక దృక్ఫథంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం కోసం రెండు వాహనాలకు ఆర్డర్ ఇచ్చినట్లు మేయర్ తెలిపారు.
ఒక రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రారంభించి అందరి మన్ననలు పొందిన కరీంనగర్ నగర పాలకసంస్థ మరో అద్బుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు.
నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తేచాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. అంతేగాదు పార్ధీవదేహం తరలింపుకు రెండు వ్యాన్లు,అవసరమైతే ఫ్రీజర్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఇక అదే రోజు మరణ ధృవీకరణ పత్రం అందించడంతో పాటు ఇంటి దగ్గర 50 మందికి రూ.5కే భోజనం కల్పించే కొత్త పథకానికి సైతం శ్రీకారం చుట్టారు.