హుజురాబాద్‌…టీఆర్ఎస్‌లోకి కొనసాగుతున్న వలసల పర్వం

130
harishrao
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే టీఆర్ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ చైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు..రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా సీఎం కేసీఆర్‌ చర్యలు‌ తీసుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి ఘననీయంగా పెరిగిందన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కానీ మత్స్యకారులు మధ్యదళారులకు తక్కువ ధరకే చేపలను విక్రయించి నష్టపోతున్నారని వాపోయారు.

మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను నాణ్యతా ప్రమాణాలతో ‘తెలంగాణ చేపలు’ అనే బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నదని చెప్పారు. మత్స్య సొసైటీల నుంచి కొనుగోలు చేసిన చేపలను రెండు, మూడు మండలాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రవాణా చేస్తామన్నారు. తొలుత హైదరాబాద్‌లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లోని మత్స్య శాఖకు చెందిన భూములలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -