కన్నడ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర రాజకీయ రంగప్రవేశం చేశారు. బెంగళూరులో ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ’ని ఏర్పాటుచేశారు. కొత్తపార్టీ పేరుతో పాటు లోగోని ఆవిష్కరించారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం అని ప్రకటించిన ఉపేంద్ర…. పార్టీ సిద్దాంతాలను వివరించారు.
ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని… తన లక్ష్యాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. సమాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని చెప్పారు. రైతాంగ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. రాజకీయరంగంలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని… దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని అభిప్రాయపడ్డారు. ఉపేంద్ర అభిమానులు భారీ ఎత్తున తరలిరాగ అందరూ ఖాకీ షర్టును ధరించడం విశేషం.
ఉపేంద్రను బీజేపీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్‌కు చెక్ పెడుదామనుకున్న బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు తమిళనాడులో కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఉపేంద్ర సొంత పార్టీ ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది.