‘అగ్నిపథ్’ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై పలువురి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ ఆందోళనలపై బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంకు కంగనా మద్దతు తెలిపింది. ఇలాంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నట్టు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే అమలు చేస్తున్నారని.. ‘ఇజ్రాయెల్’ లాంటి చాలా దేశాల్లో యువతకు సైన్యంలో శిక్షణను ఆయా దేశాలు తప్పనిసరి చేశాయని కంగనా రనౌత్ తెలిపింది. కొన్నేళ్లు ప్రతీ ఒక్కరూ ఆర్మీలో పనిచేయడం ద్వారా జీవితంలో ఎలా విలువలతో జీవించాలో తెలుసుకుంటారని.. క్రమశిక్షణ జాతీయత భావం.. దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడం ఎలాగో తెలుసుకుంటారని ఆమె చెప్పింది.
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంలో కూడా ఎంతో లోతైన అర్థం ఉందని.. ఈ స్కీం ఏదో డబ్బు సంపాదనకో.. భవిష్యత్‌ను నిర్మించుకోవడానికో ఉపాధి కల్పనకో కాదని కంగనా చెప్పుకొచ్చింది. అప్పటి రోజుల్లో ప్రతీ ఒక్కరూ గురుకులానికి వెళ్లేవారని.. ఈ ‘అగ్నిపథ్’ కూడా అలాంటిదేనని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
డ్రగ్స్ పబ్జీ లాంటి వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత శాతం షాక్ కు గురిచేస్తోందని పేర్కొంది. ఇలాంటి సంస్కరణలు ఖచ్చితంగా అవసరమేనని కంగనా అభిప్రాయపడింది.అగ్నిపథ్ లాంటి స్కీంను తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని కంగనా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కంగనా అభిప్రాయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంను ఆమె సంప్రదాయ గురుకుల విధానంతోనే పోల్చడం గమనార్హం.