కమల్‌హాసన్ రజినీతో అకస్మాత్తుగా నేడు భేటీ అయ్యరు. రజినీ నివాసానికి వచ్చిన కమల్.. ఆయనతో చాలాసేపు ఏకంతంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ భేటీ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 21న రాజకీయ పార్టీని ప్రకటించనుండటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా టూర్‌ను ప్రారంభించబోతున్న కమల్‌హాసన్.. అకస్మాత్తుగా రజినీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే భేటీ అనంతరం ఇరువురు స్టార్లు మీడియాతో మాట్లాడారు. రజినీని మర్యాద పూర్వకంగా కలిశానని, దీనిలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కమల్ చెప్పారు. ‘రాజకీయంగా మేమిద్దరం చేతులు కలపడమనేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. నా రాజకీయ యాత్ర గురించి రజినీకి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన నాకు గుడ్ లక్ చెప్పారు’ అని పోయెస్ గార్డెన్‌లో ఉన్న రజినీకాంత్ నివాసం ముందు మాట్లాడుతూ కమల్ వెల్లడించారు.
రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు ప్రజలకు కమల్ సేవ చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. డబ్బులు సంపాదించడానికో, పేరు ప్రతిష్టల కోసమో కమల్ రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే వచ్చారు’ అని చెప్పారు. తమ ఇద్దరి సినిమాల శైలి వేరని.. కమల్ సినిమా ఒక స్టయిల్‌లో ఉంటే తన సినిమా ఇంకో స్టయిల్‌లో ఉంటుందని రజినీ చెప్పారు. అలాగే రాజకీయాల్లో తమ ఇద్దరి శైలి కూడా వేర్వేరుగా ఉంటుందని తలైవా వెల్లడించారు. దారులు వేరైనా ఇద్దరి లక్ష్యం ఒక్కటేనన్నారు.