సాయివెంకట్ సమర్పణలో భీమవరం టాకీస్ బ్యానర్‌పై ఉపేంద్ర, ప్రియమణి, తులసి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `కల్పన-3`. ఉదయ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ కొనెజోటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీలను కొనెజేటి రోశయ్య విడుదల చేశారు.
చిత్ర సమర్పకుడు సాయివెంకట్ మాట్లాడుతూ – “కల్పన-3 సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. సినిమా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. మా కాంబినేషన్‌లో వచ్చిన పిశాచి2 ఈ మధ్య కాలంలో పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. పిశాచి 2 100 థియేటర్స్‌లో విడుదల చేశామంటే అందుకు కారణం రామసత్యనారాయణ. ఈ సినిమా కూడా మా కాంబినేషన్‌లో పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను“ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – “పది మంది సపోర్ట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారనే దానికి నేనే ఉదాహరణ. నేను తీసిన దెయ్యం సినిమాలన్నీ మంచి విజయాలనే సాధించాయి. ఈ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ చేశాడు. కన్నడంలో ఉపేంద్ర చేశాడు. కన్నడంలో కోట్లు వసూలు చేసిన ఈ సినిమాను తెలుగులో మే 19న విడుదల చేస్తున్నాను“ అన్నారు.
కె.రోశయ్య మాట్లాడుతూ – “ నేను సగటు ప్రేక్షకుడిని సినిమాలోని లోటు పాట్లు గురించి నాకు పెద్దగా తెలియవు. రామసత్యనారాయణ విడుదల చేస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. తమ్మలపల్లి రామసత్యనారాయణ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ – “రామసత్యనారాయణ వంద సినిమాలకు నిర్మాతగా మారనున్నాడు. తనను నేనే కంట్రోల్ చేశాను. లేకుంటే ఇప్పటికే రెండు వందల సినిమాలకు దగ్గరగా వచ్చేసేవాడేమో. నేను ఇంకా 66 సినిమాలే చేస్తున్నాను. నేను కూడా హర్రర్ సినిమాలతో మంచి విజయాలను సాధించాను. రామసత్యనారాయణ కూడా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడు“ అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – “రామసత్యనారాయణ భీమవరం టాకీస్ ఓ ఫ్యాక్టరీలా పనిచేస్తుంది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు“ అన్నాడు. ఈ కార్యక్రమంలో కె.వి.వి.సత్యనారాయణ, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.