పేదవర్గాలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం..

260
Deputy CM Kadiyam Srihari
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసిఆర్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యాశాఖలోని విద్యాలయాలు, వ్యవసాయ శాఖ, వైద్య విద్య, పశు సంవర్థక శాఖ, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ శాఖల్లోని వివిధ సొసైటీల కింద నడుస్తున్న గురుకులాల కోసం ఏటా 20వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు.

తెలంగాణలోని గురుకుల విద్యాలయాలపై ఏటా 3500 కోట్ల రూపాయలు వ్యయం చేస్తుండగా, ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం 2000 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు వివరించారు. వరంగల్ అర్భన్ జిల్లా, భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర సాధారణ గురుకుల విద్యాలయంలో జూనియర్ ఇంటర్ కోసం 40 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది నూతనంగా అప్ గ్రేడ్ అయిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ పాఠాలు చెప్పారు.

Deputy CM Kadiyam Srihari

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య దాదాపుగా అందరికీ అందుబాటులో ఉందని, అయితే నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని సిఎం కేసిఆర్ గురుకులాలను పటిష్టం చేసే బాధ్యతను అప్పగించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ నాణ్యమైన విద్య ఉండాలన్నది సిఎం కేసిఆర్ ఆశయమన్నారు. ఇందులో భాగంగానే గత 60 ఏళ్లలో 276 గురుకులాలు ఏర్పాటైతే ఈ నాలుగేళ్లలో 570 గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటు 85 కేజీబీవీలు కూడా ఏర్పాటు అయ్యాయన్నారు.

Deputy CM Kadiyam Srihari

డిగ్రీ చదివే ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 53 రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది నుంచి విద్యాశాఖ పరిధిలోని 33 సాధారణ గురుకులాలన్నింటిని జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాకు ఒక బాలుర, ఒక బాలికల సాధారణ గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అదేవిధంగా మరో 119 బీసీ గురుకులాలను కూడా ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

Deputy CM Kadiyam Srihari

తెలంగాణ రాష్ట్రంలోని పేదవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడమే కాకుండా పౌష్టికాహారం కూడా అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ప్రతి రోజు బూస్ట్ మిల్క్, అల్పాహారం, మధ్యాహ్నం 50 గ్రాముల నెయ్యితో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మంచి భోజనం పౌష్టిక విలువలతో కూడినది అందిస్తున్నట్లు వివరించారు.

విద్యార్థినిల ఆరోగ్య రక్షణలో భాగంగా ఏటా వంద కోట్ల రూపాయల విలువైన హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ను 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే 6 లక్షల మంది విద్యార్థినులకు ఇస్తున్నామన్నారు. ఇందులో విద్యార్థినిలకు కావల్సిన సబ్బులు, రిబ్బన్లు, బొట్టు బిల్లలు, పౌడర్లు, బ్రష్ లు, టూత్ పేస్టులు, నూనె, రబ్బర్ బ్యాండ్లు, సానిటరీ న్యాప్కిన్స్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా తెలంగాణలో ఉన్నన్ని గురుకులాలు ఏ రాష్ట్రంలో లేవని, అదేవిధంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ కూడా ఈ తరహాలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు.

Deputy CM Kadiyam Srihari

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్, చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి, గురుకుల విద్యాలయాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, డీఈవో నారాయణరెడ్డిలు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ , జేఈఈ, నీట్, ఐఐటి పోటీ పరీక్షల కోచింగ్ పుస్తకాలను అందించారు. విద్యార్థినిలతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు.

- Advertisement -