రేవంత్‌కి ప్రజలే బుద్దిచెప్తారు!

3
- Advertisement -

తెలంగాణలో నీటి నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఏర్పడితే ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు. నీళ్లు ఎత్తిపోయాలని కోరుతున్న తమను తిట్టడం కాదని, నీటి కొరతకు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

జైపాల్‌రెడ్డి విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరిని సుధీర్‌రెడ్డి తప్పుబట్టారు. గతంలో జైపాల్‌రెడ్డిని పచ్చి అవకాశవాది అంటూ విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే నాయకుడి పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తానంటూ ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులపై వైఖరులు మార్చుకుంటున్నారని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంపై కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణలో కరువు పరిస్థితులకు కారణమవుతోందని ఆరోపించారు. గత ఆగస్టు 1న సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోయిందని పేర్కొన్నారు.

Also Read:గుఢాచారితో ఎఫైర్..భార్యకు ద్రోహం చేశా!

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర సంస్థలు చెప్పినప్పటికీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయలేదని సుధీర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమైన నీటిని వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేయడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. నీటి నిర్వహణపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -