మీ దారెటు.. జైలుకా?బీజేపీలోకా?

21
- Advertisement -

దేశ రాజకీయాల్లో బీజేపీ దౌర్జన్యం చేస్తోందా ? ఇతర పార్టీల నుంచి ఎన్డీయేలోకి బలవంతపు ఆహ్వానాలు పలుకొతోందా ? బీజేపీతో కలిస్తే సరేసరి లేదంటే జైలుకే అనేలా కాషాయ అధిష్టానం వ్యవహరిస్తోందా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీయేతర పార్టీ నేతలపై పెద్ద ఎత్తున ఈడీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇలా ఆయా పార్టీలకు చెందిన నేతలు నిత్యం ఈడీ సమన్లతో సతమతమౌతున్నారు. .

అయితే కేసులకు భయపడే వారు బీజేపీ తో చేతులు కలిపి వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసులకు ఏ మాత్రం భయపడని వారు అక్రమంగా జైలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో ఉంచుకున్న బీజేపీ రాజకీయ స్వలాభం కోసం వాటిని ఉపయోగించుకుంటోందనే వాదన రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా కేంద్రతీరుపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరితే తనకు వస్తున్న ఈడీ సమన్లు ఆగిపోతాయని, లేదంటే తనను జైలుకు పంపించేందుకే బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేతలను బలవంతంగా బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారాయన. ఇకపోతే డిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటివరకు ఏడు సార్లు ఈడీ సమన్లను ఎదుర్కొన్నారు. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ముందు ఈ కేసు నుంచి బయట పడేందుకు కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న కేజ్రీవాల్ ఈడీ సమన్ల నుంచి బయటపడాలంటే ఎన్డీయేలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కేసులకు తలొగ్గి అప్ బీజేపీ తో చేతులు కలుపుతుందేమో చూడాలి.

- Advertisement -