డిసెంబర్ 31 కాదు…3 వరకే జియో ఫ్రీ

301
- Advertisement -

రిలయన్స్ జియో సేవలతో టెలికాం మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ వినియోగదారులకు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా తన కస్టమర్లందరికీ 4జీ డేటా, వాయిస్ కాల్స్‌ను అందరికీ ఉచితంగా ఇస్తున్న రిలయన్స్ జియో… ఈ ఉచిత సేవలు డిసెంబర్ 31 వరకు అందచేస్తామని తెలిపింది. రిలయన్స్ ప్రకటనతో ప్రధాన టెలికాం సర్వీసులు ఖంగుతిన్నాయి.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4 నుంచి అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ట్రాయ్ నిబంధనల మేరకు జియో ఉచిత సేవలు 90 రోజులకే పరిమితమని, ఇవి డిసెంబర్ 3తో ముగిసిపోతాయని ట్రాయ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జియో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కటాఫ్ తేదీగా డిసెంబరు 3ను నిర్ణయించింది.

రిలయన్స్ జియో సేవలకు ఛార్జీలు చెల్లించకూడదని, జియో సిమ్ అక్కర్లేదని భావించేవారు డిసెంబరు 3లోగా ఆ విషయాన్ని జియో స్టోర్లలో తెలియజేసి, అధికారికంగా సిమ్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సిమ్‌ను సరెండర్ చేయని పక్షంలో… వారికి డిసెంబరు 31వరకూ ఉచిత సేవలు కొనసాగుతాయి.

జియో వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత కాల్స్, డేటా ప్రయోజనాలు కస్టమర్లందరికీ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని జియో అధికార ప్రతినిధి తెలిపారు.అయితే, ఈ ఆఫర్ పొందే అవకాశం డిసెంబర్ 3 వరకే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఆ లోపు కనెక్షన్ తీసుకోని వారు ఆ తర్వాత నుంచి అందుబాటులో ఉన్న నూతన టారిఫ్ ప్లాన్ల మేరకు సేవలు పొందాల్సి ఉంటుందన్నారు. అయితే, డిసెంబర్ 4 తర్వాత పొందే సేవలకు వసూలు చేసే ఛార్జీలెంతన్నది కంపెనీ ఇప్పటికీ పేర్కొనకపోవడం గమనార్హం.

jio

మరోవైపు రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్‌చిట్ ఇచ్చింది. జియో టెలికం సేవల టారిఫ్ ప్లాన్లు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన లేదని టెలికాం కంపెనీలకు తెలియజేసింది. జియో ఉచిత కాల్స్ సేవలు నిబంధలకు విరుద్ధమంటూ టెలికం సంస్థలు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. టెలికాం ఆపరేటర్లు చేస్తున్న ఆరోపణలను కొట్టిపడేస్తూ.. రిలయన్స్ జియోకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ జియో అందించే ఉచిత కాల్ సర్వీసులపై భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఇతర టెలికాం కంపెనీలు ట్రాయ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ట్రాయ్ లెటర్కు రిలయన్స్ జియో సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిబంధనలకు తమ అన్నీ టారిఫ్ ప్లాన్స్ కట్టుబడి ఉన్నాయనడంలో ట్రాయ్ వద్ద కూడా నిరూపితమైందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -