భారత టెలీకాం రంగంలో రిలయన్స్ జియో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన ఈ కంపెనీ అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో వినియోగదారులను సొంతం చేసుకుంది. దీనికి కారణం సరికొత్త వివోఎల్టీఈ టెక్నాలజీ, అపరిమిత సేవలు. జియోకు ఓ సందర్భం ఉంటే చాలు రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. రిలయన్స్ జియో తన చందాదార్లకు మరో ఆఫర్ ఇచ్చింది.
ఈనెల 31తో జియో ప్రైమ్ సభ్యత్వ గడువు ముగియనుండగా, మరో ఏడాది పాటు ఉచితంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత జియో ప్రైమ్ చందాదార్లకు 2019 మార్చి 31 వరకు, ఇప్పుడు పొందుతున్న ఆఫర్లన్నీ కొనసాగుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా కనెక్షన్ తీసుకునేవారు, ప్రైమ్ వార్షిక సభ్యత్వం కావాలనుకుంటే, రూ.99 చెల్లించాలి. జియో చందాదార్లు ప్రైమ్ సభ్యత్వం తీసుకుంటే, లైవ్ టీవీ చానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు వంటివి తిలకించే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు టారిఫ్‌లపైనా ఆఫర్లు లభిస్తాయి.
ప్రస్తుత జియో ప్రైమ్ సభ్యులు, మైజియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వచ్చే 12 నెలల పాటు ప్రైమ్ సభ్యత్వాన్ని కొనసాగించేందుకు తనకు ఆసక్తిగా ఉందని నమోదు చేసుకోవాలని సంస్థ తెలిపింది. ప్రైమ్ సభ్యత్వాన్ని ప్రస్తుత 17.50 కోట్ల మంది చందాదార్లతో పాటు కొత్తవారికీ అందించడం ద్వారా, డిజిటల్ లైఫ్ అనుభవాన్ని వారికి చేరువ చేసేందుకు రిలయన్స్ జియో కట్టుబడి ఉందనేందుకు నిదర్శనమని సంస్థ పేర్కొంది.