JPSC:ఉద్రిక్తంగా అసెంబ్లీ ముట్టడి!

0
- Advertisement -

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రాంచీలో అభ్యర్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళన బాట పట్టిన వేలాది మంది అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు రాజధాని రాంచీలోని విధానసభ (అసెంబ్లీ) ముట్టడికి పిలుపునివ్వడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన విద్యార్థులపై వాటర్ కెనాన్‌లు ప్రయోగించి వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

అభ్యర్థుల ఆందోళనల తీవ్రతను గమనించిన జార్ఖండ్ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. రాష్ట గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ జేపీఎస్సీకి చెందిన ముగ్గురు కీలక సభ్యులు (అజిత భట్టాచార్య, అనిమా హన్స్దా, జమాల్ అహ్మద్) అందించిన రాజీనామాలను ఆమోదించారు.విద్యార్థి ప్రతినిధి బృందంతో ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం వివాదాస్పదమైన 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు 2023, 2025 ల్యాగ్‌లాగ్ నియామక పరీక్షలను రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

పరీక్షల ప్రక్రియపై అనుమానాలు నివృత్తి చేసేందుకు సీఐడీ (CID) విచారణతో పాటు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక అక్రమాలు తేలితే ఈడీ (ED) విచారణకూ రంగం సిద్ధం చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తూనే, నియామకాల్లో పూర్తి పారదర్శకత రావాలంటే సీబీఐ (CBI) విచారణ చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నిరుద్యోగ యువత ప్రయోజనాలను పరిరక్షించడం తమ ప్రభుత్వ బాధ్యతని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రాజకీయ వర్గాల మాటలు విని విద్యార్థులు దారితప్పవద్దని విజ్ఞప్తి చేశారు.

ALso Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

- Advertisement -