ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలకనిర్ణయం!

0
- Advertisement -

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాన్‌తో సమగ్ర అణు ఒప్పందం కుదరకపోయినప్పటికీ అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన హొర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిస్తే చాలని దానినే విజయావకాశంగా ప్రకటిస్తూ యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.

మధ్యంతర ఎన్నికల వేళ కీలక నిర్ణయం అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు, ద్రవ్యోల్బణం, యుద్ధంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని మరింత పొడిగించకుండా, దౌత్య మార్గంలో హొర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను పునరుద్ధరించడమే ఏకైక మార్గంగా వైట్‌హౌస్ యోచిస్తోంది. ఇరాన్ ప్రస్తుతం అణు ఆయుధాలను అభివృద్ధి చేసే స్థితిలో లేదని, కాబట్టి అణు ఒప్పందం లేకపోయినా ముప్పు లేదని ట్రంప్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ కఠిన డిమాండ్లు మరోవైపు, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి నౌకా దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో పాటు గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా తన దళాలను ఉపసంహరించుకోవాలని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కఠిన షరతులు విధిస్తోంది.

Also Read:పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు

అమెరికా తన విధానాలను మార్చుకోనంత వరకు హొర్ముజ్ జలసంధి ద్వారా పూర్తిస్థాయి నౌకాయానాన్ని అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న గల్ఫ్ దేశాలు ఈ యుద్ధం వల్ల ప్రాంతీయంగా తీవ్ర నష్టం జరుగుతుండటంతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ భాగస్వామ్య దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ మరియు అమెరికా ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇరు దేశాల కఠిన వైఖరుల వల్ల ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -