జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) 14వ ప్రిలిమినరీ పరీక్షలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. CID నమోదు చేసిన FIR ఆధారంగా ED గత వారం ECIR కేసు నమోదు చేసింది. అంతకుముందు ఆందోళన బాట పట్టిన JPSC-JSSC విద్యార్థులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అనంతరం, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నియామకాల అక్రమాలపై CID మరియు ED లతో విచారణ జరిపిస్తామని ప్రకటించింది.
ఈ సమావేశం అనంతరం మంత్రి సుదివ్య కుమార్ సోను మాట్లాడుతూ… విద్యార్థులు లేవనెత్తిన అంశాల్లో 98 శాతం డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించిందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 14వ JPSC పరీక్ష మరియు 2023, 2025 ల నాటి బ్యాక్‌లాగ్ నియామక పరీక్షల రద్దుతో సహా విద్యార్థుల పలు కోరికలకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు.
అయితే JSSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌ను గానీ, ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై CBI విచారణ జరిపించాలనే డిమాండ్‌ను గానీ ప్రభుత్వం అంగీకరించలేదు. మిగిలిన రెండు శాతం డిమాండ్లు ముఖ్యంగా CGL పరీక్షను రద్దు చేయాలనే కోరికను తీర్చలేకపోయాం. ఎందుకంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన పరీక్షను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయలేదు అని ఆయన వివరించారు.
Also Read:పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు
ప్రభుత్వ ప్రతిపాదనను నిరసనకారులైన విద్యార్థులు తిరస్కరించి సోమవారం “విధాన్ సభ ఘెరావ్” (అసెంబ్లీ ముట్టడి)కు పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రకారం, తమ ముఖ్యమైన డిమాండ్ అయిన CBI విచారణను ప్రభుత్వం ఆమోదించలేదు. తాము లేవనెత్తిన 98 శాతం డిమాండ్లను నెరవేర్చామని ప్రభుత్వం “అబద్ధాలు” ప్రచారం చేస్తోందని నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఆరోపించారు. తాము రద్దు చేయాలని డిమాండ్ చేసిన 13 పరీక్షల్లో ప్రభుత్వం మూడింటిని మాత్రమే రద్దు చేసిందని ఒక విద్యార్థి నాయకుడు తెలిపారు.

