శకం ముగిసింది….

231
Jayalalithaa's Funeral At Chennai's Marina Beach
- Advertisement -

దక్షిణాది రాజకీయాల్లో ఆమెది చెరగని ముద్రం. రాజకీయాల్లో ఒక మహిళ అసాధారాణ స్ధాయికి చేరి అత్యంత శక్తివంతంగా మారి దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్ధాయికి ఎదిగారంటే అదిది సామాన్యమైన విషయం కాదు. ఎలాంటి వెన్ను దన్ను లేకుండా తాను అనుకున్న సిద్దాంతాలను నమ్మి దానికి కట్టుబడి ముక్కుసూటిగా వెళ్లి ఎంతోమంది మెప్పు పొందిన ధీర వనిత. అమ్మ అని, పురచ్చి తలైవి అని తమిళ ప్రజలు ఆరాధించే జయలలిత జీవితం వడ్డించిన విస్తరి ఏ మాత్రం కాదు. ఒక సాధారణ పేద కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే అత్యంత ఖరీదైన జీవితాన్ని అనుభవించి అంతలోనే అవినీతిలో కూరుకుపోయి మళ్ళీ పైకి లేచి నిలదొక్కుకున్న జయలలిత జీవితంలో ఎన్నో ములుపులు ఉన్నాయి.

సంక్షేమ పథకాల స్కీములతో జనం చేత అమ్మ.. అని పిలిపించుకుంటున్న ఏఐడీఎంకే అధినేత్రి.. పురిచ్చితలైవి.. జయలలిత జైలు జీవితాన్ని సైతం గడిపారు. సీఎం పదవీని కూడా వదులుకున్నారు. అమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు…ఓడిదొడుకులను చూసింది. 1995లో జయ దత్త పుత్రుడు సుధాకరన్ వివాహానికి అయిన ఖర్చు.. అసలీ కేసుకు నాంది అని చెప్పాలి. బంగారు పూత వెడ్డింగ్ కార్డులు.. 75 వేల చదరపు అడుగుల్లో వివాహ వేదిక, రెండున్నర లక్షల మందికి భోజనాలు, వేలాది మంది కార్యకర్తలకు, వివిఐపిలకు ఖరీదైన బహుమానాలు అన్నీ వివాదాస్పదంగా నిలిచాయి. ఈ వివాహంతోనే జయ ఆస్తుల చిట్టా ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ వందకోట్ల పెళ్లి చరిత్రలో నిలిచిపోయింది.

1992లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కు చెందిన భూమిని జయ టీవికి కారు చౌకగా జయలలిత ఇప్పించారు. మార్కెట్ ధర కంటే యాభై శాతం తక్కువగా భూమిని కట్టబెట్టిన ఈ వ్యవహారాన్ని ఐఎఎస్ అధికారులు వ్యతిరేకించినా జయ వెనక్కి తగ్గలేదు. గ్రానైట్ లైసెన్సుల మంజూరు వ్యవహారంలోనూ జయలలిత అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక, న్యాయ శాఖలతో నిమిత్తం లేకుండా… తొమ్మిది సంస్థలకు గ్రానైట్ తవ్వకాల లైసెన్సులు ఇచ్చేశారు. టెండర్లు లేకుండా వీళ్లందరినీ ఆమె నామినేట్ చేయడం తీవ్ర వివాదమైంది. ఈ గ్రానైట్ స్కామ్ విలువ అప్పట్లోనే 12 కోట్లు.

ఇలా అనేక స్కాములతో పాలన సాగించిన జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ… జనతా పార్టీ అధినేత… ప్రస్తుతం బీజేపీ నేత అయిన సుబ్రమణ్య స్వామి 1996లో కేసు నమోదు చేశారు. 1997లో అధికార పగ్గాలు చేపట్టిన డిఎంకె పార్టీ… జయపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో బెంగళూరులోని స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

జయలలిత రాజకీయ భవిష్యత్ ఇక కనుమరుగైంది అనుకున్న తరుణంలో చివరికి ఊరట లభించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీని తిరుగులేని మెజారిటీతో గెలిపించిన జయ…ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. తర్వాత కొద్దిరోజులకే అనారోగ్య కారణాలతో అపోలో ఆస్పత్రిలో చేరింది. దాదాపుగా 74 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన…జయ చివరికి మృత్యువు ముందు తలవంచింది.

అమ్మ మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. జయ మృతిని తట్టుకోలేని అభిమానులు బోరున విలపిస్తున్నారు. పలువురు ప్రముఖులు జయ మృతికి సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు.

- Advertisement -