ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా నిన్న జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ జట్టు భారత జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్ బ్యాట్స్‌మెన్‌లను వెస్టీండిస్ బౌలర్లు కట్టడి చేశారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న ఆతిథ్య బౌలర్లు భారత్‌ను నిలువరించడంలో విజయవంతమయ్యారు. సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో చెలరేగిన టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ కీలకమైన నాలుగో వన్డేలో మాత్రం చతికిలబడింది. ఆరంభంలోనే జోసెఫ్ శిఖర్ ధావన్(5)ను ఔట్ చేయగా.. అనంతరం హోల్డర్ వేసిన షార్ట్‌పిచ్ బంతికి విరాట్ కోహ్లి(3) ఔటయ్యాడు. పేలవ బ్యాటింగ్‌తో 19 బంతులాడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసినదినేశ్ కార్తిక్ జోసెఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీ, కేదార్ జాదవ్ ద్వయం మరోసారి కీలక భాగస్వామ్యంతో ఆదుకుంటారని భావించారు.
కానీ జాదవ్(10)ను నర్స్ బోల్తా కొట్టించడంతో భారత్ పతనం మొదలైంది. తర్వాత వచ్చిన పాండ్య(20: 21 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు ధోనీ. ఊపు మీదున్న పాండ్యాను హోల్డర్ బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ జడేజా(11) చెత్త షాట్ ఆడి పావెల్ చేతికి చిక్కాడు. తర్వాత కొద్దిసేపటికే ధోనీ బౌండరీకి ప్రయత్నించి వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖాయమైంది. విండీస్ బౌలర్ల దెబ్బకు 49.4 ఓవర్లలోనే 178 పరుగులకు ఆలౌటయ్యారు. భారత జట్టు బ్యాట్స్‌మెన్లు రహానె 60, ధోని 54, పాండ్య 20 పరుగులు చేశారు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్ 35, కైల్ హోప్ 35, షాయ్ హోప్ 25, రోస్టన్ చేజ్ 24, జాసన్ మహ్మద్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల పరుగులు సాధించేందుకు అవస్థలు పడ్డారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు నేలకూల్చగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.