కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో సోమవారం నూతన పార్టీని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నేతలతో కలిసి నెల రోజుల సంప్రదింపుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు.
తమ పార్టీ స్వతంత్ర ఆలోచనలు సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై నడుస్తుందన్నారు. తమ పార్టీ పేరు కోసం 1500 పేర్లను పలువురు సూచించారని, ప్రజాస్వామిక, శాంతియుత, స్వతంత్రతలను ప్రతిబింబించే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని విలేకరులతో మాట్లాడుతూ ఆజాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా పసుపు తెలుపు నీలం రంగుల్లో ఉన్న పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. పసుపు సృజనాత్మక, ఏకత్వాతనికి…. తెలుపు శాంతికి…. నీలం స్వేచ్ఛ పరిమితుల్లేని పయనానికి ప్రతీక అని ఆజాద్ చెప్పుకొచ్చారు.
జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆజాద్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకొంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆజాద్.. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ రాకతోనే పార్టీ పతనం మొదలైందంటూ మండిపడ్డారు.