ధరల పెరుగుదలపై సమాధానమేది?

1
- Advertisement -

దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలనూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. పెరుగుతున్న ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన జైరాం రమేశ్.. దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబాల నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. ఒక సర్వే ప్రకారం 61 శాతం కుటుంబాలు గత ఏడాదితో పోలిస్తే తమ నెలవారీ గృహ ఖర్చులు 20 శాతానికి పైగా పెరిగినట్లు వెల్లడించాయని తెలిపారు. మరోవైపు 74 శాతం మంది అనవసర ఖర్చులను తగ్గించుకుంటుండగా, 50 శాతం మంది నిత్యావసర వస్తువుల కొనుగోళ్లను సైతం తగ్గించుకుంటున్నారని వివరించారు.

గత ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని జైరాం రమేశ్ పేర్కొన్నారు. నెయ్యి, వంట నూనెల ధరలు పెరిగాయని, కూరగాయలు, బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పుల ధరల పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. పెరుగుతున్న ఖర్చులతో సామాన్య కుటుంబాలు తమ అవసరాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని వస్త్ర పరిశ్రమ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జైరాం రమేశ్ ఆరోపించారు. ఒక్క నోయిడాలోనే ఏడాది వ్యవధిలో సుమారు 200 గార్మెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని పేర్కొన్నారు. అమెరికా సుంకాలు, ముడిసరుకుల ధరలు పెరగడం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇందుకు కారణమని విమర్శించారు. ఇది దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులకు నిదర్శనమని అన్నారు.

Also Read:KTR:గేమ్ ఛేంజర్స్..బుక్‌ లాంఛ్

ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -