కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి!

1
- Advertisement -

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా ఆటగాళ్లు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచించారు. జట్టులోని ప్రతి ఒక్కరూ మరింత కష్టపడాలని, పరిస్థితులకు అనుగుణంగా తమ ఆటతీరును మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు తీవ్ర నిరాశ, బాధలో ఉన్నారని వెల్లడించారు.

న్యూజిలాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడారు. గతంలో సాధించిన విజయాలతో పోలిస్తే ఇటీవల కొన్ని ఫలితాలు తమకు అనుకూలంగా రాలేదని అన్నారు. అయితే తాము మెరుగైన జట్టుగా ఎదగగలమనే నమ్మకం ఆటగాళ్లలో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బౌలర్లు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని మోర్కెల్ సూచించారు. పరిస్థితులు, మ్యాచ్ అవసరాలను బట్టి ఒక స్పెల్‌లో అదనపు ఓవర్లు వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. వరుసగా మంచి ఓవర్లు వేసిన తర్వాత కూడా నాలుగో లేదా ఐదో రోజు మ్యాచ్‌ను మలుపు తిప్పే అద్భుతమైన స్పెల్ వేయగల బౌలర్ అవసరమని అభిప్రాయపడ్డారు.

గతంలో ఎన్నో జట్లు ఇలాంటి అద్భుత ప్రదర్శనలతోనే విజయాలు సాధించాయని గుర్తుచేశారు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో 80 పరుగుల ఇన్నింగ్స్ లేదా చిన్న భాగస్వామ్యం మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదని, అదే విధంగా బౌలింగ్‌లో మూడు, నాలుగు ఓవర్ల అద్భుతమైన స్పెల్ కూడా చిరస్మరణీయ విజయాన్ని అందించగలదని వివరించారు. ఈ సిరీస్‌లోనూ ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ప్రత్యేకంగా రాణించాలని ఆకాంక్షించారు.

Also Read:KTR:గేమ్ ఛేంజర్స్..బుక్‌ లాంఛ్

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 51.52 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ ఓటమి, శ్రీలంకతో టెస్టు మ్యాచ్ డ్రా కావడం భారత్ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపాయి. దీంతో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

- Advertisement -