దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవితంలో ఓ భాగమైన పాదయాత్రపై సినిమా ‘యాత్ర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించగా…. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించారు.
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న నిర్మాతలు మాట్లాడుతూ.. 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు, రైతుల ఆవేదన తెలుసుకున్న వైయస్ జీవిత భాగంపై సినిమా తీయడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. వైయస్ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించామని అన్నారు. వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.