హైదరాబాద్లో మంచినీటి సమస్యలు, విద్యుత్ కోతలతో స్కూళ్లు, హాస్టళ్లకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మంచినీటి సమస్యపై ముఖ్యమంత్రి ఒకలా మాట్లాడుతుంటే.. ఇరిగేషన్ మంత్రి మరోలా మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మంచినీటి సమస్య ఉందని, నీటిని చూసి వాడుకోవాలని ముఖ్యమంత్రి చెబుతుంటే.. ఇరిగేషన్ మంత్రి మాత్రం రాష్ట్రంలో మంచినీటి సమస్యే లేదని అంటున్నారని విమర్శించారు. ఇక విద్యుత్ మంత్రి బీఆర్ఎస్ నాయకులే కరెంట్, మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి పాలన చేతకాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యతను విస్మరించి, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకుండా చెత్తబుట్టలో పడేసిందని ఆయన ఆరోపించారు. అనేక హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు అభయ హస్తం అందిస్తామని చెప్పి, ఇప్పుడు భస్మాసుర హస్తంలా మారిందని ఎద్దేవా చేశారు.
Also Read:AQI:కాలుష్యంలో ఢిల్లీకి ఫస్ట్ ర్యాంక్
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో నెలకొన్న మంచినీరు, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

