IPL:ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై

2
- Advertisement -

ప్రపంచ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఐపీఎల్‌లో ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. 45 ఏళ్ల ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు మెంటార్‌గా నియమించినట్లు కథనం పేర్కొంది. దీంతో మైదానంలో ఆటగాడిగా కనిపించకపోయినా తన అనుభవంతో జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు.

2020 ఆగస్టులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. సీఎస్‌కే తరఫున దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేశాడు. అతడి నాయకత్వంలో చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ధోనీ అంతర్జాతీయ కెరీర్‌లో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ధోనీతో తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని సీఎస్‌కే యజమాని ఎన్. శ్రీనివాసన్ పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా విజయాలు, అపజయాల్లో పరస్పర నమ్మకంతో తమ ప్రయాణం కొనసాగిందని తెలిపారు. 2008లో ధోనీని సీఎస్‌కేలోకి తీసుకోవాలని తాను పట్టుబట్టానని, అది తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని వెల్లడించారు. ధోనీ ఎప్పటికీ సీఎస్‌కే గుర్తింపులో భాగంగానే ఉంటాడని, ఈ జట్టు అతడికి సొంత ఇల్లులాంటిదని వ్యాఖ్యానించారు.

- Advertisement -