డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవడం వెనుక ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డోనాల్డ్ ట్రంప్ వ్యాపారవేత్తగా రాణించడానికీ, ఇవాంక సహాయ సహకారాలు చాలా ఎక్కువని ప్రపంచమే కీర్తిస్తోంది. అందుకే ఇవాంకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే ట్రంప్ ఏకంగా తన సలహాదారుగా నియమించి ఆమె ప్రతిభకు మరింత పట్టం కట్టారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరైన ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె రాకకు ముందు…వెళ్లిన తర్వాత ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. ప్రపంచాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగం ఎలా వుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇవాంక ప్రసంగం మొదలైంది.. పూర్తయ్యింది.. ఈ మధ్యలో ఆమె ప్రస్తావించిన అంశాలు, అందర్నీ విస్మయానికి గురిచేశాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ రోజు ప్రపంచానికి భారత్ అవసరం ఎంతుందో… చాటి చెప్పింది ఇవాంక ప్రసంగం. ఇవాంక ప్రసంగం వింటే.. మన పవర్, మన ప్రస్థానం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్రం సంపాదించుకున్న డెబ్బై సంవత్సరాల్లో భారత్ ఎక్కడి వరకూ వచ్చిందో ఎంత ప్రగతి సాధించిందో చాలా తక్కువ పదాల్లోనే చక్కగా చెప్పింది.
ఇండియా, ఇస్రో.. హైద్రాబాదీ బిర్యానీ , హైద్రాబాదీ ముత్యాలు, టీ-హబ్ గురించి ఇవాంక ప్రస్తావిస్తోంటే, మురిసిపోకుండా వుండగలమా.?. చంద్రుడ్ని దాటి మార్స్ వరకూ భారత అంతరిక్ష కార్యక్రమాలు దూసుకెళ్ళడాన్నీ ఇవాంక ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి పదం అత్యంత తేలికగా అందరికీ అర్థమయ్యేలా ఇవాంక చేసిన ప్రసంగం సింప్లీ సూపర్బ్ అంతే.
తెలంగాణలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల ఇవాంక సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆమె ధరించిన డ్రెస్‌లపైన జోరుగా చర్చ జరిగింది.నగరంలో ఉన్న రెండు రోజులు మూడు డ్రెస్‌లు ధరించిన ఇవాంక సింప్లిసిటీతో ఆకట్టుకుంది. అంతేగాదు ప్రత్యేక విమానంలో ఇవాంక హైదరాబాద్ చేరుకుంటుందని ప్రచారం జరిగిన అందరితో పాటే సాధారణ వ్యక్తిలా రావడం చెప్పుకొదగిన అంశం.
ఇక టూర్‌లో భాగంగా హైదరాబాద్ బిర్యానీ రుచి,గోల్కొండకోట నిర్మాణ వైభవాన్ని చూసి అబ్బురపడిపోయారు. భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి ఇలాంటి కోటలు నిలువుటద్దాలని ప్రశంసించారు.చివరి నిమిషం వరకు ఇవాంక టూర్ షెడ్యూల్‌ని గోప్యంగా ఉంచిన అధికారులు ఆమె హైదరాబాద్ పర్యటన విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు. మొత్తంగా పాతబస్తీలోని లాడ్ బజార్ పర్యటిస్తుందని ఆశీంచిన అక్కడి ప్రజలకు కాస్త నిరాశ ఎదురైనా ఇవాంక పర్యటన హైదరాబాద్ ప్రజలకు గుర్తుండిపోయే జ్ఞాపకంలా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.