తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెరతీశారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురిలో టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండగా.. కొంతమంది డబ్బులతో దొరికారని, వివరాలు ఆరా తీస్తే.. వారు ఏపీ పోలీసులని తెలిసిందని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీలో ఇంటెలిజెన్స్ పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని.. ధర్మపురిలో ఎన్నికలపై సర్వే చేసిన ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ వివరించారు. ఏపీ ప్రజల సొమ్ముతో చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం చేస్తూ ఇంటెలిజెన్స్ పోలీసులతో తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రూ. 500 కోట్లతో రాహుల్ గాంధీతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని.. రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ లేదని.. చిల్లర రాజకీయాల కోసం చంద్రబాబు పోలీసులను పావుగా వాడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.