తమిళనాడు రాజకీయ సంక్షోభంలో గవర్నర్ పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. గత మూడు రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన ఇవాళ చెన్నైకి రానున్నారు. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన వ్యవహారశైలిపై ఆరోపణలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కీలకంగా మారింది. అయితే బల పరీక్ష సహా, గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. బల పరీక్షతో పాటూ ఆయన దగ్గర మరో మూడు ఆప్షన్స్ ఉన్నాయి.
శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ, ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం ఇద్దరూ తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే సంఖ్యాబలంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో, బలపరీక్షకు గవర్నర్ మొగ్గు చూపే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇలాంటి సంక్షోభాల సమయంలో గవర్నర్ తీసుకునే నిర్ణయాల్లో మొదటిది ఇదే. అయితే గవర్నర్ ఈ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపాలన కుంటు పడకుండా ఉండేందుకు, పరిస్థితిలో స్పష్టత వచ్చేదాకా పన్నీర్‌ను కొనసాగిస్తారు. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకూ వేచి చూస్తారు.
ఒకవేళ నిర్దోషిగా తేలితే ఆమెకు మార్గం సుగమం అవుతుంది. దోషిగా తేలితే ఎలాగూ రాజ్యాంగపరమైన పదవులు చేపట్టే అవకాశం ఉండబోదు. అప్పుడు పన్నీర్‌సెల్వాన్ని నేతలు అంగీకరించని పక్షంలో కొత్త నేతను అన్నాడీఎంకే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రపతి పాలన వైపు కూడా గవర్నర్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఒకవేళ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తే, తమిళనాడులో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు అన్నాడీఎంకేలో ఏకాభిప్రాయం వస్తే ఎన్నికలకు వెళ్లకుండానే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీకి ఇంకా నాలుగేండ్లు గడువు ఉంది.
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలెవరూ తాజా ఎన్నికలకు సిద్ధంగా లేరు. దీంతో ఈ ఆప్షన్ వైపు గవర్నర్ మొగ్గుచూపకపోవచ్చని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇలాంటి సమయాల్లో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పన్నీర్ సెల్వాన్ని సీఎంగా కొనసాగాలని, సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించవచ్చు. అయితే ఇందుకోసం తక్కువ సమయం ఇస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం ఉన్న 133 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో కనీసం 117 మంది మద్దతు ఆయనకు అవసరం ఉంటుంది. అటు పార్టీ తనకే దక్కాలంటే 90 ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది.
ఈ నాలుగు ఆప్షన్లు కాకుండా గవర్నర్ మరో నిర్ణయం కూడా తీసుకునే అవకాశముంది. రాజీనామాను ఉపసంహరించుకుంటానని పన్నీర్ సెల్వం ఇప్పటికే ప్రకటించారు. దీనిపై కూడా గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒత్తిళ్ల వల్లనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని గవర్నర్ విద్యాసాగర్ రావు కు పన్నీర్ సెల్వం వివరించి, సంఖ్యాబలాన్ని నిరూపించుకోగలిగితే రాజీనామా ఉపసంహరణకు ఛాన్స్ ఉంది. కానీ దీనికి కొన్ని రాజ్యాంగ పరమైన చిక్కులున్నాయని నిపుణులు అంటున్నారు. ఎలాగూ మెజార్టీ నిరూపించుకోవాలి కాబట్టి, బలపరీక్షకు వెళ్లడం ఇంత కంటే సులువు అవుతుంది. ఇవన్నీ కాకుండా పన్నీర్ సెల్వం డీఎంకే మద్దతు కూడా తీసుకోవచ్చు. ఇప్పటికే శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు పరోక్షంగా పన్నీర్ సెల్వంకే దక్కనుంది. కాబట్టి పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినప్పటికీ, బయటి నుంచి డీఎంకే మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు.