కుక్క మనిషిని కరవడం కామన్. కానీ..మనిషే కుక్కను కరిస్తే..? వినడానికే వింతగా ఉంది కదూ..? నిజానికి ఇలాంటి ఘటనలనే అప్పట్లో ‘వార్త’గా చెప్పుకునేవాళ్ళు. కారణం..? అనవసర విషయాలు వార్తల్లో ఉండకూడదనే ఉద్దేశమే.
అయితే నిజంగానే ఇలాంటి విచిత్ర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. పోలీసుల వెంట ఓ జాగిలం (కుక్క) కూడా వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులకు కనబడకుండా ఓ ఇంట్లో దాచుకున్న నిందితులను ఆ జాగిలం గుర్తించింది. దీంతో కంగారు పడిపోయిన నిందితుల్లో ఒకడు ఆ జాగిలాన్ని గట్టిగా పట్టుకుని, దాని తలని కొరికేశాడు.
దీంతో దానికి తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా ఓ అధికారిపై కూడా దాడి చేసి తప్పించుకోవాలనుకున్నాడు ఆ నిందితుడు. అయినప్పటికీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నిందితులు న్యూ హ్యాంప్‌షైర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పుకొచ్చారు.