పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు …ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయడం వంటి చర్యలతో మమత తీవ్రమైన కష్టాల్లో కురుకుపోయింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం తప్పదనే వార్తలు వస్తున్నాయి.
ఈ సంక్షోభం మధ్య మమతా బెనర్జీ…. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే టీఎమ్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 58 మంది అసమ్మతి టీఎమ్‌సీ ఎమ్మెల్యేలను ప్రధాన ప్రతిపక్ష బ్లాక్‌గా స్పీకర్ రతీంద్ర నాథ్ బోస్ గత వారం గుర్తించారు. పార్టీ నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ముఖ్యంగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తీరును వీరు బహిరంగంగా సవాలు చేస్తున్నారు.
నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన కాకోలి ఘోష్ గత వారం పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. బెంగాల్ అభివృద్ధి కోసం తనతో పాటు దాదాపు 20 మంది ఎంపీలం….. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆమె తెలిపారు. తిరుగుబాటు శిబిరంలో ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, జాదవ్‌పూర్ ఎంపీ సాయోని ఘోష్ వంటి ప్రముఖులు ఉన్నారు.
Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్
అయితే విలీన వార్తలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. కాంగ్రెస్, టీఎమ్‌సీల విలీన చర్చలు కేవలం పుకార్లేనని, అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ‘ఎక్స్’ లో స్పందిస్తూ.. సోనియా గాంధీ, మమతా బెనర్జీ భేటీపై వస్తున్న కొన్ని వార్తా కథనాలు పూర్తిగా తప్పు…. వారి మధ్య చాలా సుహృద్భావ వాతావరణంలో వ్యక్తిగత విషయాలపై చర్చ జరిగింది అని స్పష్టం చేశారు.

