దర్శకధీరుడు రాజమౌళి మాట తప్పారు. అవును ఆయన ఏంచేస్తానని చెప్పారో అది చెయ్యట్లేదు. దీంతో సినీలవర్స్కి చెప్పిన మాటల్ని జక్కన్న ఈజీగా దాటేశాడనే అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ జక్కన్న ఏం చెప్పారనేగా మీ డౌట్..? ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదల తర్వాత రెండు నెలల పాటు విరామం తీసుకుంటా.. సినిమా ఆలోచనలకు దూరంగా ఉంటా అని రాజమౌళి చెప్పారు. అయితే ఆ మాటకు కట్టుబడి జక్కన్న ఉండట్లేదని సమాచారం.
‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత కుటుంబంతో కలిసి భూటాన్ పర్యటనకు వెళ్లి వచ్చిన రాజమౌళి.. ఇప్పుడు మళ్లీ సినిమాల మీదికి దృష్టి మళ్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఆయన రచయితల బృందంతో కలిసి తన కొత్త సినిమాకు ఎలాంటి కథ అయితే బాగుంటుందని చర్చిస్తున్నాడట రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే రాసిన కథల్ని కూడా రాజమౌళి పరిశీలిస్తున్నాడట.
రాజమౌళితో సినిమా చేయాలని చాలామంది హీరోలు.. నిర్మాతలు తహతహలాడుతున్నారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళితో సినిమా చేయడానికి ఫ్రంట్ రన్నర్ అంటున్నారు. ఇప్పటికే రాజమౌళితో మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తన జక్కన్నతో సినిమా చేసే అవకాశం అందుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు మహేష్ బాబు నుంచి కూడా రాజమౌళికి కొంచెం ప్రెజర్ ఉంది.
వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ప్రయత్నిస్తున్నారు. ఐతే రాజమౌళి ఎవరికీ కచ్చితమైన హామీ ఇవ్వలేదని.. కథను బట్టే హీరోను ఎంచుకోవాలని చూస్తున్నాడని సమాచారం.
ఏదో ఒక కథ ఫైనలైజ్ చేశాక.. దాని మీద ఇన్ పుట్స్ ఇచ్చి.. మరో దేశానికి హాలిడే కోసం వెళ్లే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. జక్కన్న తర్వాతి సినిమాపై ప్రకటన రావడానికి ఇంకో రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశముంది. మొత్తానికి రాజమౌళి ఎంత రెస్ట్ తీసుకుందామనుకున్నా..ఆయన మనసు మాత్రం సినిమా కథలవైపే మళ్ళుతోంది. ఇప్పటికే జక్కన్న నెక్ట్స్ మూవీ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. త్వరలో జక్కన్న మూవీ అనౌన్సు అయితే మాత్రం ఫ్యాన్స్ కి పండగే.