2029 లోక్సభ ఎన్నికల్లో ఇండియా (INDIA) కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని నేరుగా ప్రకటించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. ఈ విషయంపై రేపు జరిగే విలేకరుల సమావేశంలో స్పష్టం చేస్తామని ఆమె తెలిపారు. ప్రతిపక్ష కూటమిలో నాయకత్వ వివాదాలు, బీజేపీ విమర్శల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.
2029 లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి రేసు మరియు నాయకత్వ బాధ్యతలపై ఇండియా కూటమిలోని అంతర్గత భేదాభిప్రాయాలు మరొకసారి వివాదానికి దారితీశాయి. అగ్రపదవికి సంబంధించి ఒక స్పష్టమైన ముఖ చిత్రాన్ని ప్రతిపక్ష కూటమి ఇప్పటివరకు ప్రకటించలేకపోయింది.
న్యూఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల ఉన్నత స్థాయి సమావేశం అనంతరం, 2029 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఉంటారా? అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని విలేకరులు ప్రశ్నించారు.
అయితే ఈ ప్రశ్నకు మమతా బెనర్జీ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. మొదట సరదాగా “మీరే అభ్యర్థి అవుతారు” అని అంటూ ఆ తర్వాత “రేపు మా విలేకరుల సమావేశం ఉంది అప్పుడే వివరాలు చెబుతాం అని వ్యాఖ్యానించారు.
2023లో ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఎవరు నడిపించాలనే అంశం వివాదాస్పదంగానే ఉంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వరుసగా మద్దతు ఇస్తున్నప్పటికీ, అనేక రకాల భాగస్వామ్య పక్షాలు ఆయనను బహిరంగంగా అంగీకరించేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
Also Read:ఇకపై ఆ పాత్రలు చేయను!
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ ప్రతిపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు. స్వయంగా కూటమి భాగస్వాములే రాహుల్ గాంధీని తమ నాయకుడిగా అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రయత్నాన్ని తనను తాను నిలబెట్టుకోవడానికి చేస్తున్న ’50వ ప్రయత్నం’గా చౌహాన్ అభివర్ణించారు. ఆయన ఇలా ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తారని ప్రశ్నించారు.

