Jagan:జగన్ పై ‘ప్రజాగ్రహం’ ఉందా?

13
- Advertisement -

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి రెట్టింపు అవుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలందరూ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ రెండోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే రెండు నెలల ముందు నుంచే ప్రచార పర్వానికి తెర తీసింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల ప్రచారంలో నేరుగా ప్రజల్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి.. దాదాపు ఐదేళ్ల తర్వాత బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రజలు జగన్ కు నీరాజనాలు పలుకుతున్నారని, ఎక్కడ చూసిన జనసంద్రంతో మేమంతా సిద్దం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.

అయితే రియాలిటీ వేరే వుందా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. ప్రజల్లో జగన్ చేపట్టిన బస్సు యాత్రకు తీవ్రమైన ప్రతికూలత ఎదురవుతోందని, దాన్ని బట్టి ఆయనపై ఉన్న ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతున్న బస్సు యాత్రలో ఇటీవల కొందరు జగన్ బస్సుపై చెప్పులు విసరడం రాష్ట్ర రాజకీయల్లో చర్చనీయాంశం అవుతోంది. గత ఎన్నికల ముందు ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఇదే విధంగా చెప్పులు విసిరిన సంగతి విధితమే.

అయితే ఇలాంటి పరిణామాలు రాజకీయ వ్యూహంలో భాగామా ? లేదా నిజంగానే ప్రజాగ్రహమా ? అనే విషయాన్ని పక్కన పెడితే ఎంతో కొంత రాజకీయంగా డ్యామేజ్ చేసే పరిణామమే. మరి సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఒకవైపు జగన్ చెబుతుంటే… మరోవైపు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యాడని, సైకో పాలన అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడక తప్పదు.

Also Read:భానుడి భగభగ..మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

- Advertisement -