వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోజన నాణ్యతపై తీవ్ర వివాదం చెలరేగింది. ఒక ప్రయాణికుడు తనకు అందించిన ఆహారంలో పురుగులు ఉన్నాయని ఆరోపించడంతో, ఐఆర్‌సీటీసీపై రూ.10 లక్షల జరిమానా విధించారు.
ఈ ఘటన మార్చి 15న పాట్నా–టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పాట్నాకు చెందిన కంటెంట్ క్రియేటర్ రితేష్ కుమార్‌కు భోజనం అందించిన వెంటనే ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో పెరుగు బౌల్‌లో స్పష్టంగా పురుగులు కనిపించాయి.
ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికుడు, ట్రైన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరో వీడియోలో రైల్వే అధికారులు అతని సీటు వద్దకు చేరుకుని ఫిర్యాదును పరిశీలించిన దృశ్యాలు కనిపించాయి. టార్చ్ సహాయంతో పెరుగు పరిశీలిస్తూ, అందులో కదులుతున్న పురుగులను గుర్తించారు. అదే ట్రేలో మిగతా ఆహారం కూడా ఉంచబడినట్లు వీడియోలో కనిపించింది.
ఈ ఘటనను గమనించిన ఇతర ప్రయాణికులు కూడా అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కంప్లైంట్ బుక్ ఇవ్వాలని డిమాండ్ చేయగా, మరికొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు.
Also Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!
వీడియోలు వైరల్ కావడంతో ఈ అంశంపై భారతీయ రైల్వే స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు తెలిపింది. ట్రైన్ నంబర్ 21896 (పాట్నా–టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్)లో వచ్చిన ఆహార నాణ్యతపై ఫిర్యాదును గంభీరంగా తీసుకున్నాం. చర్యగా IRCTCపై రూ.10 లక్షల జరిమానా విధించాం. సేవలందిస్తున్న కాంట్రాక్టర్‌పై రూ.50 లక్షల జరిమానా విధించి, ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించాం. ప్రయాణికుల భద్రత, నాణ్యత మా మొదటి ప్రాధాన్యం అని పేర్కొంది.
ఈ ఘటన రైల్వే క్యాటరింగ్ సేవల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యతపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

