వేవ్స్‌ సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్

4
- Advertisement -

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సు (వేవ్స్)ని నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. భారత మీడియా, వినోద రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రపంచంలో దాని ప్రభావాన్ని విస్తరించడానికి ఈ సదస్సు దోహదం చేస్తుంది. వేవ్స్ ప్రచారం కోసం  నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) వద్ద రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ, వేవ్స్ సదస్సు మొత్తం మీడియా, వినోద రంగాన్ని కవర్ చేసే మొట్టమొదటి ప్రపంచస్థాయి సదస్సు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, ఈ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో తగిన పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయని, దీనిని ఇపుడు జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు.

మీడియా, వినోద రంగాన్నీ, సాంకేతికతనీ వేవ్స్ సదస్సు మరింత దగ్గరకు తెస్తుందని శ్రీ సంజయ్ జాజు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న మీడియా, వినోద రంగంలో చర్చలు, వాణిజ్య సహకారం, ఆవిష్కరణలను పెంపొందించే ఒక ప్రధాన వేదికగా పనిచేయడమే వేవ్స్ లక్ష్యమన్నారు.

అవకాశాలను అన్వేషించడానికి, సవాళ్లను అధిగమించడానికి, భారతదేశానికి వ్యాపారావకాశాలను అందించడానికీ ప్రముఖులు, వాటాదారులు, ఆవిష్కర్తలను ఒక చోటకు చేరుస్తుందని చెప్పారు. ఓ రకంగా- ఈ రంగ భవిష్యత్తును వేవ్స్ తీర్చిదిద్దుతుందని తెలిపారు.

అంతకుముందు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఫిల్మ్ అసోసియేషన్స్, ఏవీజీసీ రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఎఫ్‌సీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గేమింగ్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి మద్దతు అందిస్తామని శ్రీ సంజయ్ జాజు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎన్ఎఫ్‌డీసీ జీఎమ్, వేవ్స్ సీఈఓ శ్రీ అజయ్ ధోక్, సీబీఎఫ్‌సీ సీఈఓ శ్రీ రాజేంద్ర సింగ్, సీబీఎఫ్‌సీ హైదరాబాద్ నుండి ఆర్ఓ శ్రీమతి షిఫాలీ కుమార్, ఈఓ శ్రీ రాహుల్ గౌలికర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:హైడ్రాకు చట్టబద్దత..కేబినెట్ కీలక నిర్ణయం

- Advertisement -