నల్లధనంపై నరేంద్రమోడీ ప్రకటించిన మెరుపుదాడిపై ప్రముఖుల నుంచి సామాన్యుని దాకా దేశం యావత్తూ అభినందనల జల్లు కురిపించింది. అయితే సినీ పరిశ్రమను పెద్ద దెబ్బ కొట్టింది పెద్ద నోటు. కాసులు కురిపించే శుక్రవారం ఈ సారి సినీ నిర్మాతలకు నిద్ర లేకుండా చేసింది. ఎలాగోలా అనుకున్న ప్రకారం కొన్ని సినిమాలు శుక్రవారం విడుదలైనా వాటిని చూసే ప్రేక్షకుడే కరువయ్యాడు. సాధారణంగా శుక్రవారంనాడు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ ఈ శుక్రవారం దేశంలోని అన్నీ భాషల్లో సినిమాలు విడుదలైనా.. గతంలో కనిపించేంత సందడి ఇప్పుడు లేదని, చాలాచోట్ల సినిమాలు చూసేవారు కరువయ్యారని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు నెత్తికొట్టుకుంటున్నారు.
దాదాపు తెలుగురాష్ట్రాల్లో శుక్రవారం విడుదలైన సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడిందని అంటున్నారు. ఇక బెంగళూరులో అయితే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల వైపు వచ్చే జనమే లేకపోవడంతో అవి ఈగలను తోలుకుంటున్నాయి. షోలు వేసేందుకు తగిన టికెట్ మనీ కూడా రాకపోతుండటంతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. మోడీ పెద్ద నోట్ల రద్దు దెబ్బకు అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం.. నాకేం భయ్యం , అదేవిధంగా మోహన్‌లాల్- సత్యరాజ్(కట్టప్ప ఫేమ్) నటించిన ఇద్దరూ.. ఇద్దరే సినిమాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చిల్లర సమస్యతో జనాలు థియేటర్ల వైపు రావడం తగ్గించారు. అయితే ఒకే ఒక్కడు మాత్రం సినిమా చూసేందుకు హాల్‌కు వచ్చాడు. అతడి కోసం యాజమాన్యం షో రన్ చేసింది. ఈ సందర్భంగా తమకు నష్టం వచ్చినా మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ యజమాని చెప్పడం విశేషం.
ఇక పెద్ద నోట్లు చెల్లక… చిన్ననోట్లు దొరక్క సామాన్యుల తిప్పలు వర్ణనాతీతం. ప్రయాణాల మధ్యలో ఉన్నవాళ్లు,పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నవారు ఈ నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జ్వరాలు వచ్చినా ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారు. బ్యాంకుల్లో క్యూలో నిల్చొని ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఇంతకుముందెప్పుడు చూడలేదు.