ఆసియా కప్‌లో ఆసక్తికర ఫైట్‌కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. దాదాపు ఏడాది తర్వాత ఇరు దేశాలు తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లూ తలపడగా.. భారత్‌పై పాక్ భారీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు పాక్‌ను ఓడించడం భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఆసియా కప్‌లో భారత్, పాక్ ఇప్పటివరకు 12 సార్లు తలపడగా ఆరుసార్లు (5 వన్డేలు, 1 టీ20) భారత్ గెలిచింది. ఐదు మ్యాచ్‌లు పాక్ సొంతమయ్యాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాక పాక్‌కు యూఏఈనే సొంతగడ్డగా మారింది. ఇక్కడి పిచ్‌లు వారికి కొట్టిన పిండి. కాబట్టి బుధవారం పాక్‌ను ఓడించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే.
పాక్ బలం బౌలింగే. పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ఒక్కడు చాలు.. భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసరడానికి. నిషేధం వల్ల ఐదేళ్లు ఆటకు దూరమైనా అతడి బౌలింగ్‌లో పదునేమీ తగ్గలేదు. పునరాగమనంలోనూ అతను చెలరేగిపోతున్నాడు. ఆసియా కప్ మ్యాచ్‌లో 84 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా భారత్ చాలా కష్టపడేలా చేశాడు ఆమిర్. ఓవరాల్‌గా నేడు జరిగే దాయాదుల పోరు యుద్ధాన్ని తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.