శ్రీలంక పర్యటనలో భాగంగా రెండో వన్డేలో గెలుపుతో టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. ఇన్నాళ్లూ న్యూజిలాండ్‌పై 92 విజయాలతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. దీనిని శ్రీలంకపై 93వ గెలుపుతో రికార్డును తిరగరాసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే దీపక్ చహర్ చేసిన 69 పరుగులు ఇండియా తరఫున ఎనిమిదవ నంబర్ బ్యాట్స్‌మన్ చేసిన రెండో అత్యధిక పరుగులు కావడం విశేషం. అతని కంటే ముందు 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో రవీంద్ర జడేజా ఇదే స్థానంలో వచ్చి 77 పరుగులు చేశాడు. ఇక భువనేశ్వర్‌తో కలిసి దీపక్ చహర్ నెలకొల్పిన 84 పరుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా తరఫున రెండో అత్యధిక పార్ట్‌నర్‌షిప్.
టీమిండియా ఓటమి తప్పదనుకున్న సమయంలో బాహుబలిలా ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు దీపక్ చాహర్. తొలుత నెమ్మదిగా ఆడిన తర్వాత ఫోర్లు,సిక్స్‌లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఫలితంగా భారత్ 3 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది.