సహకార సమాఖ్యకు స్పూర్తిగా భారత్ నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన మోదీ… ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో 50 మంది ఎంపీలు మట్లాడారని, సుమారు 13 గంటల పాటు వారు అభిప్రాయాలను వెలిబుచ్చారని, వారంతా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారని, ఆ ఎంపీలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
కరోనా వేళ లాక్‌డౌన్ సమయంలో దీపాలు వెలిగించిన ఘటనను గుర్తు చేస్తూ.. కొందరు ఆ ఘటనలను వెక్కిరించారని ప్రధాని మోదీ అన్నారు. రోడ్డుపై గుడిసెలో ఉన్న వ్యక్తి దేశ క్షేమం కోసం దీపం వెలిగిస్తే.. అతన్ని మనం వెక్కిరిస్తున్నామని, ఎన్నడూ స్కూల్‌కు వెళ్లని ఓ వ్యక్తి ఈ దేశం కోసం దీపం వెలిగిస్తే, వారిని కొందరు ఆటపట్టిస్తున్నారని మోదీ ఆరోపించారు.
యావత్ ప్రపంచం మొత్తం భారత్‌పైనే దృష్టి పెట్టిందని… భారత్‌పై ప్రతి ఒక్కరి అంచనాలు పెరిగాయని, ఈ భూగోళం బాగు కోసం ఇండియా ఏదైనా చేస్తుందన్న విశ్వాసం వారిలో పెరిగినట్లు తెలిపారు. భారత్ నిజంగానే అవకాశాలు కల్పించే నేల అని, అనేక అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, ఉత్సాహాంతో ఉరకలేస్తున్న ఈ దేశం.. ఎటువంటి అవకాశాల్ని వదలిపెట్టదని ఆయన అన్నారు.